Saturday, June 22, 2013

మేరా భారత్ 'అవమాన్'!


మేరా భారత్ 'అవమాన్'!


              విపత్తులు, విలయాలకు కేరాఫ్ అడ్రస్ జపాన్. ఇప్పుడు అలాంటి విపత్తుకు సాక్ష్యంగా నిలిచింది భారత్. ఇలాంటి విపత్తులను అరచేతులు అడ్డుపెట్టి ఆపలేం. కానీ సాయం కోసం హాహాకారాలు చేస్తున్న వారికి చేతులు అందించి ఆదుకోగలం. ఇప్పుడు హిమాలయ సునామీతో అల్లకల్లోలమైన చార్ధామ్ లో జరుగుతున్నదేంటి..? ఓపక్క ప్రభుత్వాలు సహాయక చర్యల కోసం నానాతిప్పలు పడుతుంటే స్థానికులు మాత్రం బాధితులను అడ్డంగా దోచుకునే పనిలో పడ్డారు. టీ యాభై అట, వాటర్ బాటిల్ వందట, బిస్కిట్ ప్యాకెట్ రెండొందలట, మీల్స్ మూడొందలట. ఎక్కడికక్కడ చిక్కుకుపోయి నరకాన్ని అనుభవిస్తున్న యాత్రికులను స్థానిక వ్యాపారులు నిలువునా దోచుకుంటున్న తీరిది.


             అందుకే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హుందాగా, మానవత్వంతో ఎలా వ్యవహరించాలో మనం జపాన్ ను చూసి నేర్చుకోవాలి. ఇలాంటి విలయాలను ఎన్నింటినో కళ్లారా చూసారు జపాన్ వాసులు. కానీ ఏ ఒక్కసారి కూడా ఇంతటి నీచానికి దిగజారలేదు అక్కడి వ్యాపారులు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో జపాన్ లోని హోటళ్లు ఉచితంగా భోజనం పెట్టకపోయినా ఇలా అడ్డంగా దోచుకోవు. నో లాస్, నో ప్రాఫిట్ పద్ధతిన అక్కడి బాధితులకు మూడు పూటలా భోజనం పెట్టేందుకు సిద్ధంగా ఉంటాయి. ప్రకృతి బీభత్సంతో అల్లకల్లోలమైపోయిన సమయంలో డబ్బులు తీసుకోనైనా సరే ఇలా వండి వడ్డించడం కూడా గొప్పే. డబ్బులున్నా తినలేని పరిస్థితి ఉన్నవారికి ఇలాంటి హోటళ్లు కొండంత అండ. ఆపదలో ఉన్న మనిషిని మరో మనిషి అర్థం చేసుకునే తత్త్వం అంటే ఇదేనేమో.కానీ మన దగ్గర జరుగుతున్నదేంటి...? కనీసం జాలి, దయ కూడా చూపించకుండా అందినకాడికి దోచుకోవడం తప్ప.


                ఇక చార్ ధామ్ యాత్రికుల దగ్గర నగలు, డబ్బు దోచుకుంటున్నారట. వినడానికే సిగ్గుచేటు. ఛీఛీ ఇంతటి నీచానికి కూడా దిగజారుతారా అని గుండెలు బాదుకోవాల్సిందే. ఈ విషయంలోనూ మనం జపాన్ వాసులను ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ రోడ్లపై దుకాణాలు తెరిచే ఉన్నా కనీసం ఇలాంటి దొమ్మీలకు దిగరు. షాపుల్లో ఎవరూ లేరు కదా ఇదే మంచి అవకాశమని లూటీలు చేయరు. ఏటీఎంలు ధ్వంసమై ఉన్నా ఒక్క నోటు కూడా ముట్టరు. చార్ ధామ్ లో చిక్కుకుపోయిన యాత్రికుల దగ్గర దోపిడీలకు పాల్పడి డబ్బూ, నగలూ ఎత్తుకెళ్తున్నారంటే అంతకుమించిన అమానవీయం ఇంకోటి ఉండదేమో.

ఇలా మానవత్వంలేని వాళ్లు ఉన్న మన దేశాన్ని చూసి మేరా భారత్ మహాన్ అనుకోవాలా..? మేరా భారత్ 'అవమాన్' అనుకోవాలా..?